కామారెడ్డి, జూలై 23
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) తన 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డిలో సేవా కార్యక్రమాలతో ఘనంగా వేడుకలు నిర్వహించింది. జర్నలిస్టులు కేక్ కటింగ్తోనే సరిపెట్టకుండా, విద్యార్థులకు, రోగులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డిలో ఎన్ యూ జే (ఐ) అనుబంధంగా ఉన్న టీజేఏ జర్నలిస్టులు సేవా కార్యక్రమాలతో వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సడక్ సునీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కటింగ్తోనే సరిపెట్టకుండా, విద్యార్థులు, రోగులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి సామాజిక బాధ్యతను చాటిచెప్పారు. మొదట ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో టీజేఏ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
సమాజానికి నిజాలను చేరవేయడం పాత్రికేయుల బాధ్యత అని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించడం జర్నలిస్టుల కర్తవ్యమని ఎన్యూజే(ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు ఉక్కల్కర్ రాజేందర్ నాథ్ అన్నారు. దేవున్ పల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు నిజాయితీ, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో ఎదగాలని, మంచి పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.
అనంతరం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన టీజేఏ సభ్యులు అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రోగులను పరామర్శిస్తూ వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ, సమాజానికి సేవ చేయడమే జర్నలిస్టుల అసలు లక్ష్యమని, వార్తలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుండాలని పేర్కొన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ భవిష్యత్తులో కూడా విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలకు సంబంధించిన మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్ యూ జే (ఐ) కార్యవర్గ సభ్యుడు డి. రాజలింగం, టి జే ఏ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల నీలకంఠం, టి జే ఏ ప్రతినిధులు శ్రీధర్, సుందర్, శ్రీనివాస్ రావు, గోవర్ధన్, అమృత్ రావు, అరవింద్, మోహన్, నవీన్, మారుతి, సాయులు, రాజేందర్ రావు, ఫర్వేజ్, ఎల్లన్న, నక్క సిద్దిరాములు, వినోద్, టి. సాయులు, యాదన్న, రేణుకుమార్ తో పాటు తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు, పలు విద్యార్ధి సంఘాల నేతలు, దేవుని పల్లి జడ్పిహెచ్ ఎస్ పాఠశాల హెచ్ ఎం. గంగా కిషన్, విద్యార్థులు, జిల్లా ఆసుపత్రి ఆర్ ఎం ఓ డాక్టర్. రవీందర్ గౌడ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







