ఉత్తరప్రదేశ్ సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 644 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, 24 వేలకుపైగా స్టార్టప్‌లు, 8 యూనికార్న్‌లు ఉన్నాయని తెలిపారు. మొబైల్ తయారీ నుంచి మైక్రోచిప్‌లు, కృత్రిమ మేధ వరకు రాష్ట్రం విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం సామాజిక మాధ్యమం ద్వారా రాష్ట్రంలో 2017 తర్వాత చోటుచేసుకున్న మార్పులను యోగి ఆదిత్యనాథ్ వివరించారు. దేశంలో తయారయ్యే మొబైల్ ఫోన్లలో సుమారు 60 శాతం, ఎలక్ట్రానిక్స్ విడిభాగాల్లో 55 శాతం వాటా ఉత్తరప్రదేశ్దేనని ఆయన పేర్కొన్నారు. జేవర్లో రూ.3,706 కోట్ల వ్యయంతో హెచ్సీఎల్ఫాక్స్కాన్ చిప్ తయారీ యూనిట్ ఏర్పాటవుతోందని తెలిపారు.
డేటా సెంటర్లకు భారీ పెట్టుబడులు
రాష్ట్రంలో డేటా సెంటర్ల రంగం కూడా విస్తరిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం డేటా సెంటర్ ప్రాజెక్టులకు ఇప్పటివరకు రూ.21,342.90 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. 644 మెగావాట్ల సామర్థ్యంపై పనులు కొనసాగుతున్నాయి. కొత్త డేటా సెంటర్ విధానం ద్వారా భవిష్యత్తులో 2 గిగావాట్లకు పైగా సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
24 వేలకుపైగా స్టార్టప్‌లు
ఉత్తరప్రదేశ్‌లో స్టార్టప్ వ్యవస్థ కూడా వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వ స్టార్టప్ మిషన్ తాజా డ్యాష్‌బోర్డ్ ప్రకారం రాష్ట్రంలో 24,840 డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్‌లు ఉన్నాయి. వీటిలో మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లు 1,366గా ఉన్నాయి. రాష్ట్రంలో 88 ఇంక్యుబేటర్లు, 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు పనిచేస్తున్నాయి.
గతంలో ఉత్తరప్రదేశ్ ప్రధానంగా సాంకేతిక ఉత్పత్తులకు మార్కెట్‌గా ఉండేదని, ఇప్పుడు సాంకేతికతను తయారు చేసే రాష్ట్రంగా మారుతోందని యోగి అన్నారు. ఎలక్ట్రానిక్స్ నుంచి డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ వరకు విస్తరించడం వల్ల యువతకు ఉద్యోగాలు, కొత్త వ్యాపార అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే 10 లక్షల మంది యువతను కొత్త సాంకేతికతలతో అనుసంధానం చేయాలనే లక్ష్యంతో ఏఐ-ప్రజ్ఞ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు సీఎం తెలిపారు. లక్నోను ఏఐ, డీప్‌టెక్ రంగాల్లో కీలక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి.
మొత్తంగా, మొబైల్ తయారీ నుంచి మైక్రోచిప్, డేటా సెంటర్, స్టార్టప్, ఏఐ రంగాల వరకు విస్తరిస్తున్న సాంకేతిక మౌలిక వసతులను కొత్త ఉత్తరప్రదేశ్‌కు ప్రతీకగా సీఎం యోగి అభివర్ణించారు.











