పార్టీకి వెన్నెముకగా నిలిచే కార్యకర్తలను విస్మరించడం, వారిని కేవలం ఎన్నికల యంత్రాలుగా చూడటం రాజకీయ పార్టీలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తలను గౌరవించే పార్టీలే దీర్ఘకాలం మనుగడ సాగిస్తాయని, వారిని ఉపయోగించుకునే పార్టీలు కొంతకాలం మాత్రమే గెలుస్తాయని పేర్కొంటున్నారు.
కార్యకర్తను మరిచిన రాజకీయానికి పతనం తప్పదు. కార్యకర్తను ఉపయోగించుకునే పార్టీ కొంతకాలం గెలవొచ్చు. కార్యకర్తను గౌరవించే పార్టీ మాత్రం తరతరాలు నిలబడుతుంది. పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలే. ఆ పట్టుకొమ్మలను నరికేసి చెట్టు బలంగా ఉంటుందని అనుకోవడం రాజకీయ భ్రమ మాత్రమే. రాజకీయాల్లో మాటలు ఎక్కువయ్యాయి, విలువలు తగ్గిపోయాయి. సిద్ధాంతాలు పుస్తకాలకే పరిమితమవుతున్నాయి, ప్రయోజనాలు రాజకీయాలను నడిపిస్తున్నాయి. నిన్నటి శత్రువు నేడు మిత్రుడవుతున్నాడు. గెలిపించడానికి కష్టపడినవాడు ఒక దశలో పక్కకు నెట్టబడుతున్నాడు. ఓడించడానికి శ్రమించినవాడే మరో దశలో ఆత్మీయుడవుతున్నాడు. ఇదేనా నేటి రాజకీయ సంస్కృతి ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. కానీ ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లిన ప్రతి రాజకీయ నాయకుడికి ఒకే రకమైన మాట వినిపిస్తుంది: మా ఓటు మీకే, మా మద్దతు మీకే. ఆ మాట నిజమో కాదో ఎన్నికల ఫలితం చెబుతుంది. కానీ ఒక కార్యకర్త మాత్రం తన పార్టీ కోసం పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తాడు. ఓటరు ఇంటి తలుపు తట్టేది నాయకుడు కాదు, కార్యకర్త. పార్టీ జెండాను గ్రామ వీధుల్లో మోసేది నాయకుడు కాదు, కార్యకర్త. కష్టకాలంలో పార్టీని నిలబెట్టేది కూడా కార్యకర్తే.
అయితే ప్రశ్న ఒక్కటే: కార్యకర్తకు పార్టీలో స్థానం ఎక్కడ ఎన్నికలు వస్తే కార్యకర్త గుర్తుకొస్తాడు. ఎన్నికలు ముగిశాక అతని ఫోన్కు సమాధానం ఉండదు. అధికారం ఉన్నప్పుడు నాయకుడి చుట్టూ తిరిగే వారికి పదవులు, అవకాశాలు దక్కుతాయి. సంవత్సరాల తరబడి పార్టీ కోసం పనిచేసిన సాధారణ కార్యకర్త మాత్రం అదే చోట నిలబడిపోతాడు. ఈ వైరుధ్యం కొనసాగితే పార్టీకి కేడర్ ఎలా బలపడుతుంది ఇంకో వైపు కుటుంబ రాజకీయాలపై చర్చ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రాజకీయాల్లో ఒక కుటుంబం నుంచి మరో తరం రావడం తప్పు అని చెప్పలేం. కానీ అవకాశాలు వారసత్వంగా మారి, కష్టపడే కార్యకర్తకు తలుపులు మూసుకుపోతే మాత్రం అది ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం. రాజకీయాల్లోకి రావడానికి డబ్బు, కుటుంబ నేపథ్యం, అధికార పరిచయాలు కాకుండా ప్రజల కోసం చేసిన పని కూడా అర్హతగా మారాలి. లేకపోతే పార్టీలు ప్రజాస్వామ్య సంస్థలుగా కాకుండా కొద్దిమంది చేతుల్లో నడిచే వ్యవస్థలుగా మారే ప్రమాదం ఉంది.
అసలు విషాదం మరోచోట ఉంది: పార్టీని గెలిపించడానికి ప్రాణం పెట్టిన కార్యకర్తను మరిచిపోయి, పార్టీని ఓడించడానికి ప్రయత్నించిన వ్యక్తిని రాజకీయ అవసరాల కోసం అక్కున చేర్చుకోవడం ఏ రాజకీయ నీతి రాజకీయ వ్యూహం పేరుతో ఎవ్వరినైనా మిత్రుడిగా చేసుకోవచ్చు. కానీ ఆ ప్రక్రియలో సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్త మనసును గాయపరిస్తే ఆ గాయం ఎన్నికల సమయంలో ఓట్లరూపంలో బయటపడుతుంది. నాయకులు మారవచ్చు. పదవులు మారవచ్చు. పొత్తులు మారవచ్చు. రాజకీయ సమీకరణాలు మారవచ్చు. కానీ పార్టీకి పునాది మాత్రం కార్యకర్తే. కార్యకర్తను గౌరవించని పార్టీ ప్రజలను ఎలా గౌరవిస్తుంది కార్యకర్తను కాపాడని నాయకత్వం పార్టీని ఎలా కాపాడుతుంది కష్టకాలంలో కార్యకర్తను గుర్తించని పార్టీ గెలుపు సమయంలో అతనిపై ఎలా హక్కు చెప్పగలదు

