జగిత్యాల జిల్లాలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన "ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని, ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలోనూ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించి, పలు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. పరిశుభ్రత కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.
ఆరోగ్య అవగాహన వారోత్సవాలు, రహదారి భద్రత కార్యక్రమాలు, సంక్షేమ వారోత్సవాలు, ఇందిరమ్మ ఇళ్ల గృహజ్యోతి ప్రవేశ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ వివరించారు. పాఠశాలల్లో మాదకద్రవ్యాల నివారణపై కూడా అవగాహన కల్పించినట్లు తెలిపారు.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను 100 శాతం పూర్తి చేశామని, 85,616 మంది రైతుల నుంచి 5,19,156 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ.1,238 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సన్నబియ్యం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
కేంద్రియ విద్యాలయం, యంగ్ ఇండియా పాఠశాలలకు భూమి కేటాయింపు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల గుర్తింపు, బ్రేక్ఫాస్ట్ పథకం అమలుకు సన్నాహాలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సుల ప్రారంభం, మహిళల భద్రతపై అవగాహన, చెత్త నిర్వహణపై చైతన్యం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివరించారు. జిల్లాలో 45 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని వర్షాలు ప్రారంభమైన వెంటనే పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.





